కార్మిక నాయకుడి నుండి హోం మంత్రి దాకా… ఇదీ నాయిని ప్రస్థానం !

-

తెలంగాణ రాష్ట్ర తొలిహోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(86) కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దానినుంచి కోలుకున్నా ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షెన్ సోకింది. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఇక నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. పోరాట పటిమ గల నాయకుడు. నల్గొండ జిల్లాకు చెందిన నాయిని 1960వ దశకంలో హైదరాబాద్ వచ్చారు. కార్మికుల హక్కుల పోరాటంతో కార్మిక నాయకుడిగా ఎదిగారు.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాయిని ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తెలంగాణ ఉద్యమం తొలి నాళ్ల నుంచి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. నాయిని నర్సింహారెడ్డి హెచ్‌ఎస్సీ చదివారు. ఇక ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1978లో తొలిసారి ఆయన చట్టసభల్లో అడుగుపెట్టారు. 1978 నుంచి 83 వరకు…1985 నుంచి 89…2004 నుంచి 2006 వరకు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి కేసీఆర్ వెంట నడిచారు నాయిని.

2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పొత్తులో భాగంగా నాటి వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా చేరారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో రాజీనామా చేసి బయటకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. 2014 నుంచి 18 వరకు కేసీఆర్ క్యాబినెట్ లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవలే నాయని ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది. నాయినికి భార్య…ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి క్రియాశీలక రాజకీయలలో ఉన్నారు. నాయిని అల్లుడు ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news