జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాత కక్షలను మనసుపెట్టుకుని ఇరు వర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని తెరాసలో పాత విభేదాలు ఒక్కసారి భగ్గుమన్నాయి. కేటీఆర్ రోడ్ షో నేపథ్యంలో తెరాస అభ్యర్థి మాగంటి గోపీనాథ్ వర్గీయులు, సతీశ్ రెడ్డికి ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్‌షో నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కోసం మాగంటి తన అనుచరులతో కలిసి ఎర్రగడ్డలోని యునాని ఆస్పత్రి వద్ద వేచి ఉన్నారు. ఇంతలోనే జూబ్లీహిల్స్ తెరాస సీనియర్ నేత సతీశ్‌రెడ్డి మంత్రిని కలిసేందుకు అక్కడకు వచ్చారు. దీంతో సతీశ్ రెడ్డి రాకను వ్యతిరేకించిన మాగంటి అనుచరులు జోక్యం చేసుకొని ఇక్కడకెందుకొచ్చారంటూ ప్రశ్నించడమే కాకుండా వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
ఈ పరిస్థితిని గమనించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పి అక్కడినుంచి పంపించేశారు. పూర్తి వ్యవహారంపై ఆగ్రహించిన కేటీఆర్ రోడ్ షో నిర్వహించకుండానే తన వాహనంలో నేరుగా శ్రీరామ్‌నగర్ చౌరస్తా వద్ద సభ వద్దకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి కార్యకర్తలందరినీ కలుపుకొని వెళ్లకుండా ఇదేంటంటూ మాగంటి గోపీనాథ్‌పై ఆగ్రహించినట్టు తెలుస్తోంది.