టీడీపీకి కంచుకోట వంటి అనంతపురం జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గం సింగనమల. 2014, అంతకు ముందు కూడా టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గత ఏడాది ఎన్నికల్లో సీనియర్ నాయకురాలు.. శమంతకమణి కుటుంబాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు.. అనూహ్యంగా బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారు. అయితే, ఆమె ఓడిపోయారు. ఈ ఓటమికి జగన్ సునామీతోపాటు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కూడా కలిసి రాలేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు.. తనకు వ్యతిరేకంగా చక్రం తిప్పారని.. అందుకే ఓడిపోయానని ఆమె గతంలోనే పలుమార్లు అదినేతకు ఫిర్యాదు చేశారు.
అయినా కూడా బండారు శ్రావణిని అధిస్టానం పట్టించుకోలేదు. అయితే, ఇంచార్జ్‌గా మాత్రం ఆమెనే కొనసాగిస్తున్నారు. కానీ, రాజు, శ్రావణిల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. పార్టీ కార్యక్రమాలకు శ్రావణి పిలుపునిచ్చినా.. ఏ ఒక్కరూ స్పందించడం లేదు. అంతా కూడా రాజు కనుసన్నల్లోనే మెలుగుతున్నారని శ్రావణి ఆరోపణ. పార్టీలో రాజు ఆధిపత్య పోరు కారణంగా సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణితో పాటు ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల పార్టీ మారి వైసీపీలోకి చేరారని బండారు శ్రావణి అనేక సార్లు ఆరోపించారు.
అయినాకూడా రాజు విషయంలో చంద్రబాబు చర్యలు తీసుకోలేదు. ఇక, తాజాగా జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనలోనూ రాజు ఆధిపత్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. లోకేష్ పర్యటనకు శ్రావణి దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. నేతల పర్యటనపై తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. అయితే, వాస్తవానికి పార్టీ అధిష్టానం కూడా శ్రావణిని పట్టించుకోవడం లేదని స్థానికంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె కన్నా రాజు సరైన నాయకుడనే వాదన బలపడుతోంది.
ఇటీవల కాలంలో ఆయన ఎస్సీ వర్గాలకు అండగా ఉండడం.. పార్టీ తరఫున కార్యక్రమాలకు హాజరు కావడంతో ఆయనకే ప్రాధాన్యంఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, శ్రావణి మాత్రం పార్టీలో ఇంకా తనకు ప్రాధాన్యం ఇస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారని, ఇక, ఆమె దారి ఆమె చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి ఇది కూడా రాజు ఆడిస్తున్ననాటకమేనని శ్రావణి చెబుతున్నారు. ఏదేమైనా. సింగనమల నియోజకవర్గంలో టీడీపీ చీలికలు.. పీలికలను తలపిస్తోంది.