స్థానిక ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు కింది చేయిగా ఉన్న జగన్ సర్కారుది .. ఇక పై మాత్రం పైచేయి అవుతుందని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో కరోనా విజృంభణ జోరుగా ఉండడం.. పైగా సర్కారు కూడా ఇదే వాదనను వెలుగులోకి తీసుకువస్తుండడం. స్థానిక ఎన్నికల విషయంలో ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేష్ బాబు.. అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి లేని సమయంలోనే ఆయన వాయిదాకు సిద్ధపడ్డారు. దీంతోప్రబుత్వం ఎదురు నిలిచింది. కరోనా వ్యాప్తి లేదు కదా.. నువ్వు ఎందుకు ఆపావని ప్రశ్నించింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే తాను ఎన్నికలను వాయిదా వేశానని ఆయన చెప్పుకొన్నారు. ఇదే విషయంపై పెద్ద రగడ చోటు చేసుకోవడం హైకోర్టు వరకువిషయం వెళ్లడం.. ప్రబుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడం తెలిసిందే. ఆ వెంటనే నిమ్మగడ్డ మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా సీటులో కూర్చోవడం జరిగిపోయాయి. అయితే, ఇప్పుడు మరోసారిస్థానిక ఎన్నికల విషయం వెలుగు చూసింది.
రాష్ట్రానికి చెంది న ఓ వ్యక్తిహైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. దీంతో హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కమిషనర్ నిమ్మగడ్డ అన్ని పార్టీలతోనూ విడివిడిగా భేటీ అయి వారి సమాచారం రాబట్టారు. దీనిలో పెద్దపార్టీగా ఉన్న టీడీపీ కూడా కరోనా విస్తృతి తగ్గలేదనే చెప్పడం గమనార్హం. ఇక, చిన్న చితకాపార్టీలు కూడా ఎన్నికలు నిర్వహించాలని సూచించినా. కరోనా నేపత్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇక, అధికార వైసీపీ మాత్రం ఈ భేటీకి దూరంగా ఉంది. ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఇలా ఎందుకు చేశారనేది సర్కారు వాదన. ఏదేమైనా.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గలేదు కనుక ఎన్నికలకు ఇప్పట్లో వెళ్లేది లేదనే ప్రభుత్వ వాదనకు బలం చేకూరుతోంది. మేధావులు కూడా ఇంకా వ్యాప్తి తగ్గనందున ఎన్నికలకు ఇప్పుడే తొందరెందుకు ? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎన్నికల కమిషనర్ కూడా ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదిస్తారని సమాచారం. దీంతో ప్రభుత్వానికి ఇప్పుడు పైచేయి అవుతుందని అంటున్నారు పరిశీలకులు.