దేశవ్యాప్తంగా కొత్త పౌరసత్వ చట్టాన్ని అమలు చేయడానికి బిజెపి కట్టుబడి ఉంది అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. కరోనా వైరస్ కారణంగా ఈ ప్రక్రియను నిలిపివేశామని ఆయన నిన్న పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా వ్యాఖ్యానించారు. కోల్‌కతా శివారులోని రాజర్‌హాట్ లోని తూర్పు మండల సాంస్కృతిక కేంద్రంలో బిజెపి నాయకులతో అంతర్గత సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
షాతో సమావేశానికి హాజరైన సీనియర్ బిజెపి నాయకులు ఈ చట్టం గురించి బెంగాల్ లో కాస్త ఆందోళన ఉందని, అందరికి స్పష్టమైన హామీ ఇవ్వాలి అని షా దృష్టికి తీసుకు వెళ్ళారు. అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త యుగంలో బలమైన బెంగాల్ ను నిర్మించడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. మమతా బెనర్జీ లక్ష్యం ఆమె మేనల్లుడు (అభిషేక్ బెనర్జీ) ను తదుపరి సిఎంగా చేయడమే అన్నారు.