కరోనా నేపథ్యంలో ప్రస్తుతం కేవలం రెండు రకాల టెస్టులను మాత్రమే చేస్తున్న సంగతి తెలిసిందే. ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్ట్. ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్. ఇలా రెండు టెస్టులతో కరోనా పాజిటివ్, నెగెటివ్ నిర్దారిస్తున్నారు. అయితే ఈ టెస్టులను వైద్య సిబ్బంది మాత్రమే చేస్తున్నారు. కానీ షుగర్ టెస్ట్ చేసుకున్నట్లు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఎలాంటి కిట్‌లు అందుబాటులో లేవు. కానీ తాజాగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఈ విషయంలో విజయం సాధించింది.
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా కరోనా వైరస్ సెల్ఫ్-టెస్టింగ్ కిట్ వినియోగానికి అనుమతులు జారీ చేసింది. ఇంట్లో టెస్ట్ చేసుకునేందుకు రూపొందించిన తొలి కరోనాటెస్ట్ కిట్ ఇదే కావడం విశేషం. దీంతో కేవలం 30 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది.
లుసిరా హెల్త్ అనే సంస్థ ఈ కిట్‌ను డెవలప్ చేసింది. దీన్ని ఇంట్లోనే ఒక్కసారికి వాడుకోవచ్చు. అయితే శాంపిల్స్ ను మాత్రం వైద్య సిబ్బంది ద్వారా సేకరించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ సమయాల్లో వాడుకునేందుకు వీలుగా ఉంటుందని ఈ కిట్‌కు అనుమతులు ఇచ్చామని యూఎస్ ఎఫ్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. దీని వల్ల బాధితులు ఇండ్లలోనే కోవిడ్ టెస్టులు చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే సదరు కిట్ ధర ఎంత ? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది ? ఇతర దేశాల్లో లభిస్తుందా ? అన్న వివరాలను ఇంకా వెల్లడించలేదు.