ప్రపంచ వ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లో బ్రాడ్ బ్రాండ్ స్పీడ్ చాలా తక్కువగానే ఉంది. నగరాలు, అభివృద్ధి చెందిన పట్టణాలు కాకుండా మారుమూల ప్రాంతాలు, ఇతర పట్టణాల్లో బ్రాడ్ బ్యాండ్ జనాలకు అందడం లేదు. దీంతో అనేక చోట్ల మొబైల్ ఇంటర్నెట్ దిక్కు అవుతోంది. అయితే దేశంలో ఎక్కడైనా సరే ఇకపై ప్రజలకు కనీసం 2 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ అందాల్సిందేనని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు సూచనలు చేసింది.
మన దేశంలో అనేక చోట్ల చాలా మందికి బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ కనీసం 512 కేబీపీఎస్ కూడా రావడం లేదని బీఐఎఫ్ తెలిపింది. ట్రాయ్ ఇప్పటికే కనీస బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 512 కేబీపీఎస్ ఉండాలని ఆదేశాలు ఇచ్చినా దేశంలో ఎవరికీ కనీసం ఆ స్థాయి స్పీడ్‌తో ఇంటర్నెట్ అందడం లేదని బీఐఎఫ్ అభిప్రాయపడింది. ఇక ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అత్యంత ఆవశ్యకం అయిన నేపథ్యంలో జనాలకు తమ అవసరాలు తీరాలంటే కనీసం 2ఎంబీపీఎస్ అయినా ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలని, కనుక బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌ను కనీసం 2 ఎంబీపీఎస్ చేయాలని బీఐఎఫ్ కోరుతోంది.
అయితే బీఐఎఫ్ ఇప్పటికే ఆ విషయమై ట్రాయ్‌కు అనేక పత్రాలను సమర్పించినా ట్రాయ్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ట్రాయ్ ఎలా స్పందిస్తున్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కానీ రోజు రోజుకీ ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా దేశంలోని ప్రజలకు ప్రభుత్వాలు కనీసం 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అయినా ఇంటర్నెట్‌ను అందించాలి. మరి దీనిపై ఏం ఆలోచన చేస్తారో చూడాలి.