బీజేపీ ఉత్తరాంధ్ర నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే.. పెన్మత్స విష్ణుకుమార్ రాజు తాజాగా వైసీపీపై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి కరంగా మారాయి. వైసీపీ మరోసారి అధికారం రావడం కల్లేనని.. కేవలం మరో మూడేళ్లు మాత్రమే.. అధికారంలో ఉంటుందని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడేళ్లలోనే వైసీపీ మూతబడుతుందని కూడా విష్ణు అనేశారు. దీంతో ఈ వ్యాఖ్యలకు ఎనలేని ప్రాధాన్యం వచ్చేసింది. ప్రధాన మీడియా భారీ రేంజ్‌లో కవర్ చేసేసింది. ఇన్నాళ్లుగా విష్ణు ఎక్కడ ఉన్నాడంటూ.. అందరూ అనుకుంటున్న తరుణంలో ఆకస్మికంగా ఆయన మీడియా ముందుకు వచ్చారు.
వచ్చీ రావడంతోనే వైసీపీపై బాణాలు ఎక్కు పెట్టారు. ఇక, తాను చెప్పిన వైసీపీ మూతబడుతుందనే విషయానికి బలం చేకూర్చు కునేలా.. గతంలో తానే చెప్పిన ఓ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఎప్పుడో తిరుపతి సభలో.. టీడీపీ మళ్లీ గెలవదని తాను చెప్పానని అదే జరిగిందని.. చెప్పుకొచ్చారు. సో.. మొత్తానికి విష్ణుకుమార్ రాజు వ్యవహారం ఆసక్తిగా మారింది. అయితే.. ఇక్కడితో ఆగిపోతే.. విష్ణు విషయం పరిపూర్ణం కాదు. ఇక్కడే అసలు విషయం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు విష్ణుకు మద్దతిచ్చాయి. అదే సమయంలో మరి కొన్ని వర్గాలు ప్రశ్నలు సంధించాయి.
రాజకీయాల్లో ఉన్నారు కనుక.. సహజంగానే ఎదురు ప్రశ్నలు వస్తాయి. ఇవే ఇప్పుడు విష్ణుకు ఎదురయ్యాయి. “వైసీపీ గురించి విష్ణు సార్.. మంచి జోస్యం చెప్పారు అంతా బాగుంది. వచ్చే మూడేళ్లలో వైసీపీ భవితవ్యాన్ని ఇప్పుడే చెప్పినందుకు థ్యాంక్స్! మరి.. మన పరిస్థితి ఏంటి విష్ణన్నా?!“ అని కొందరు ప్రశ్నలు వేశారు. మరికొందరు.. అన్నా.. మన కాళ్ల కింద నీళ్లు తోడుకోకుండా.. ఎదుటి వారి కాళ్లకింద నీళ్ల గురించి మనకెందుకు? అని దెప్పిపొడిచారు.
ఇంకొందరు.. బీజేపీలో గుర్తింపు కోసం ఆరాట పడుతున్న విష్ణు.. ఎట్టకేలకు ఓ గొప్ప విషయాన్ని కనిపెట్టారు. మరి బీజేపీ అయినా.. పుంజుకుంటుందా ? అది కూడా చెప్పేస్తే.. ఓ పని అయిపోతుంది.. మనోళ్లు తట్టాబుట్టా సర్దేసుకుంటారు…!- అని మరికొందరు ప్రశ్నించారు. మరి వీటికి కూడా విష్ణు సమాధానం చెబుతారో.. లేదో చూడాలి..!