ఈ వైసీపీ నేతలు పవర్‌లోకి రాగేనే ఫీజు తీసేసినట్టు అయ్యారా

-

కష్టం వస్తే ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్తారు ప్రజలు. సమస్యలు పరిష్కరించాలని కోరతారు. అక్కడి గిరిజనులు కూడా అదే ఆశించారు. అందుబాటులో డిప్యూటీ సీఎం.. పిలిచినంతనే పలికే ఎమ్మెల్యేలు ఉండటంతో ఇక్కట్లు రావని భావించారు. కానీ కీలక అంశాలు వచ్చేసరికి ఎవరికి వారు సైడైపోవడం విజయనగరం జిల్లాలో రాజకీయంగా కాక రేపుతోంది.

దేవుడు వరమిచ్చినా పుజారి కరుణించలేదన్నట్టుగా ఉంది అక్కడి గిరిజనుల ఆవేదన. ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. అధికారులు తాము చెప్పిందే వేదమంటారు. కురుపాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో ఏజెన్సీ ప్రాంతాలు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి. 3 అంశాలు స్థానిక గిరిజనులకు తీరని సమస్యగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరలకు చెప్పి ఉపశమనం పొందడం ఇక్కడి గిరిజనులకు అలవాటు. కానీ… శిఖపరువులో మైనింగ్‌, కుడుమురు భూములు, షెడ్యూల్‌ సర్టిఫికెట్ల సమస్యలను తలనొప్పులుగా భావిస్తున్నారట ప్రజాప్రతినిధులు.

సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో 1492 గ్రామాలు షెడ్యూల్‌ కిందకు వస్తాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. కానీ.. పార్వతీపురం ఐటీడీఏ అధికారులు 772 గ్రామాలే షెడ్యూల్‌ కిందకు వస్తాయని చెబుతున్నారు. దీంతో మిగిలిన గ్రామాలు మౌలిక సదుపాయాలకు, అక్కడివారు విద్యా ఉపాధి అవకాశాలకు దూరం అవుతున్నారు. ఇదే విషయమై అనేక దఫాలుగా ప్రజాప్రతినిధులకు విన్నవించినా సమస్య ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది. ఇప్పటికే సాలూరు మండలం జగ్గుదోరవలస గ్రామంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

విపక్షంలో ఉన్నప్పుడు గిరిజనుల ప్రస్తావించిన ఈ సమస్యలకు సంఘీభావం తెలిపిన ప్రజాప్రతినిధులు.. పవర్‌లోకి రాగానే ఫీజు తీసేసినట్టు అయిపోవడం గిరిజనులను ఆశ్చర్య పరుస్తోంది. పైగా ఎవరైనా గట్టిగా నిలదీస్తే అంతా అధికారులే చేస్తున్నారు.. మా చేతుల్లో ఏం లేదని చెప్పడం గిరిజనులను నివ్వెర పరుస్తోందట. దీంతో దేవుడు వరమిచ్చినా పుజారి కరుణించలేదన్నట్టుగా తమ పరిస్థితి మారిందని వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులే పట్టించుకోకపోతే ఇంకెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. మరి.. గిరిజనుల అరణ్యరోదనకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news