తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టించాలనే ఏకైక నిర్ణయంతో ముందుకు దూసుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆలోచన వెనుక ఉన్నది ఏంటి? ఆయన ఏం చూసుకుని కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు? కేవలం దుబ్బాక ఉప ఎన్నికలో విజయమా? లేక.. గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగు స్థానాల నుంచి 48 స్థానాలకు ఎగబాకడమా? ఈ రెండు కాకుండా.. కాంగ్రెస్ పుంజుకోలేదు కనుక.. తామే ప్రత్యామ్నాయమని ఆయన భావిస్తున్నారా? అంటే.. తెలంగాణ రాజకీయ పరిశీలకులు.. కీలక విషయాన్ని తెరమీదకి తెచ్చారు. ఇవన్నీ కూడా బండి సంజయ్ దూకుడుకు కారణాలే అయినా.. వీటికన్నా మించిన కారణం.. మరొకటి ఉందని.. చెబుతున్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్.. కేసీఆర్‌పై దూకుడుగా ఉన్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబం కోట్లు పోగేసు కుందని.. గతంలో టీడీపీలో ఉండగా.. రేవంత్‌రెడ్డి సైతం ఆరోపించారు. అయితే. ఎందుకో తెలియదు కానీ.. ఆ తర్వాత ఆయన ఈ మాట దాటవేశారు. ఇది తప్ప.. అన్ని విమర్శలు చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్‌లో కీలక నేతలు కూడా కాళేశ్వరం అవినీతి గురించి ముందు మాట్లాడినా.. తర్వాత మౌనం పాటించారు.
అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై ఆధారాలు సేకరించే పనిలో బండి సంజయ్ ఉన్నారని బీజేపీ నేతల నుంచి గుసగుస వినిపిస్తోంది. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా, తెలంగాణ రైతుల తల రాతలు మార్చే ప్రాజెక్టుగా కేసీఆర్ ప్రచారం చేస్తున్న ఈ ప్రాజెక్టులో అవినీతి నిజమేనని కొన్ని పత్రికలు కూడా రాసుకొచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకుని బండి సంజయ్ ఇటీవల కాలంలో కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. “రాష్ట్రంలోకి సీబీఐ వస్తుంది. నీ అంతు తేలుస్తుంది!“ అంటూ బండి భారీ కామెంట్లే చేస్తున్నారు.
ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించే అనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇదిలా వుంటే.. ఇటీవల కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ పర్యటనకు వెళ్లడం.. వెనుక కూడా.. బండి సంజయ్ దూకుడుకు బ్రేకులు వేయాలని కోరడమేనా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా.. గతానికి భిన్నంగా బండి దూకుడు పెంచడం మాత్రం టీఆర్ ఎస్‌లో కలకలం రేపుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.