తెలంగాణ‌లో ఉద్యోగులు అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటా?

-

కొత్త సంవ‌త్సర కానుకగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. జీతాల పెంపు, ప్రమోషన్లు, బదిలీలు, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు, ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఆర్టీసీ, హోంగార్డులు ఇలా అంద‌రూ క‌లిపి 9 లక్షల 36వేల మంది లబ్ధి పొందుతార‌ని ప్రకటించారు సీఎం. వీట‌న్నింటి మీద అధ్యయనం చేయ‌డానికి.. ఉద్యోగ సంఘాల‌తో చర్చల కోసం అధికారుల‌తో ఒక క‌మిటీని నియ‌మించారు. ప్రభుత్వం వ‌రాల జ‌ల్లు కురిపించినా ఉద్యోగులు కోరుకున్నట్టు జరగడం లేదా? ఆలస్యంగా సీఎం కరుణించినా అనుకోని అడ్డంకలు వచ్చి పడ్డాయా దీనిపైనే తెలంగాణ ఉద్యోగుల్లో చర్చ నడుస్తుంది.

చీఫ్‌ సెక్రటరీ సోమేష్ కుమార్ అధ్యక్షతన రామ‌కృష్ణారావు, ర‌జ‌త్ కుమార్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జ‌న‌వ‌రి రెండో వారంలో ఉద్యోగుల‌తో స‌మావేశమై వేత‌నాలు, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు, స‌ర్వీసు రూల్స్ స‌ర‌ళ‌త‌రం చేయాల‌ని సూచించారు ముఖ్యమంత్రి. అయితే అస‌లు వివాదం ఇక్కడే మొద‌లైందట. ప్రభుత్వ ఉద్యోగుల‌కు సీఎస్ సోమేశ్‌కుమార్‌కు మధ్య కొన్నాళ్లుగా పెద్ద అగాధ‌మే న‌డుస్తోంది. త‌మ సమస్యలపై స‌రిగా స్పందించ‌డం లేద‌ని అసంతృప్తితో ఉన్నాయి ఉద్యోగ సంఘాలు. క‌నీసం త‌మ రిప్రజెంటేషన్‌ను కూడా తీసుకోకుండా పేషీలో ఇచ్చిపోవాలని గతంలో అవ‌మాన‌ప‌రిచార‌ని గుర్రుగా ఉన్నాయి.

పీఆర్‌సీతోపాటు బదిలీలు, ప్రమోషన్లు ఇలా త‌మ ఏ సమస్యలనూ ఏరోజూ కనీసంగానైనా విన‌లేద‌ని ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ఇప్పుడు చర్చలకు అధికారుల‌తో క‌మిటీ వేయ‌డంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. సమస్యలకు మూల‌కార‌ణం ఎవ‌రున్నారో వారితో చర్చలు ఏంట‌ని ప్రశ్నిస్తున్నాయట. అధికారుల క‌మిటీకి బ‌దులుగా మంత్రుల క‌మిటీ వేయాల‌నేది ఉద్యోగ సంఘాల డిమాండ్. మంత్రి కేటీఆర్‌తోపాటు ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు లాంటి వారితో క‌మిటీ వేస్తే పెండింగ్ సమస్యలకు ప‌రిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారట.

అన్నింటికీ మించి క‌మిటీలో ఒక్కరు కూడా తెలంగాణ‌కు చెందిన వారు లేరనే చర్చ మొదలైందట. ఏపీతో కూడా ముడిప‌డిన సమస్యలు ఉండ‌గా సోమేష్‌, ర‌జ‌త్, రామ‌కృష్ణారావుల‌తో క‌మిటీ వేయ‌డంతో తెలంగాణ ఉద్యోగులు మండిప‌డుతున్నాయి. ఈ చర్య సమస్యకు ప‌రిష్కార‌మా లేక మ‌రింత ఆల‌స్యం చేయ‌డానికా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి దూరమైన ఉద్యోగుల‌ను మ‌చ్చిక చేసుకునే ప్రయత్నంలో ఇలాంటి నిర్ణయాలు ఎటు దారితీస్తాయో అన్న ఉత్కంఠ క‌నిపిస్తోందట. మరి… ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news