రైతు సంఘాల నేతలతో ఏడో సారి చర్చలు.. ఏమవుతుందో ?

-

రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం నేడు 7 వ విడత చర్చలు జరపనుంది. రెండు ప్రధాన అంశాల పై చర్చలు ప్రధానంగా సాగనున్నాయి. మూడు వివాదస్పద వ్యవసాయ చట్టాల రద్దు, “కనీస మద్దతు ధర” అమలుకు చట్టబద్దత కల్పించడం అనే అంశాల మీద రైతులు పట్టు బడుతున్నారు.  గత వారం ఆరవ విడత జరిగిన చర్చల్లో రైతు సంఘాల నేతలు ప్రతిపాదించిన మొత్తం నాలుగు డిమాండ్లలో రెండు అంశాల పై పరస్పర అంగీకారానికి వచ్చారు. “విద్యుత్ సవరణ బిల్లు” ఉపసంహరణ, మరొకటి “వాయు నాణ్యత కమిషన్ ఆర్డినెన్స్” లో  పొందుపరిచిన పంట వ్యర్థాలను తగులబెట్టే రైతులపై జరిమానా, శిక్ష విధించే నిబంధనలు తొలగింపు పై ప్రభుత్వం అంగీకారం కూడా తెలిపింది.

నేడు జరిగే 7 వ విడత చర్చల్లో  మిగిలిన రెండు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ఇప్పటికే హెచ్చరించాయి.  చర్చలు విఫలమైతే, జనవరి 6 వ తేదీన “జి.టి-కర్నాల్” రహదారిపై ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ముందే హెచ్చరించారు. గణతంత్ర దినోత్సవం కల్లా అన్ని డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోకపోతే, దేశ రాజధాని వైపుకు చొచ్చుకువస్తామని కూడా హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news