కష్టపడి పనిచేయాలే గానీ ఏ వ్యాపారం పెట్టినా అందులో సక్సెస్ సాధించవచ్చు. కాకపోతే ఆరంభంలో కొద్దిగా శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఆ శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా లభిస్తుంది. అవును.. సరిగ్గా ఇలా అనుకున్నాడు కనుకనే అతను సెక్యూరిటీ గార్డు స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా ఓ చిన్నపాటి బిజినెస్‌ను నిర్వహించే స్థాయికి ఎదిగాడు. అతనే పూణెకు చెందిన రేవన్ షిండే.
రేవన్ షిండే వయస్సు 28 ఏళ్లు. పూణెలోని పింప్రి చించ్వాడ్లో ఓ ఆఫీస్ ఎదుట సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అయితే ఆ కంపెనీని తీసేస్తున్నారని తెలిసి అతను జనవరి 1, 2020 నుంచి టిఫిన్లను అమ్మడం మొదలు పెట్టాడు. ఇడ్లీ, శాండ్విచ్, వడ, దోశ వంటి అల్పాహారాలను విక్రయించేవాడు. అయితే లాక్డౌన్ కారణంగా అతను ఉపాధిని కోల్పోయాడు. అయినప్పటికీ దిగులు చెందలేదు. అంతలోనే ఇంకో ఆలోచన చేసి కేవలం రూ.15వేల పెట్టుబడితో అభిమన్యు అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేశాడు. అందులో ఇంకో 5 మందికి ఉపాధి కల్పించాడు.
ఇక రేవన్ తన స్టార్టప్ ద్వారా 65 ఆఫీస్‌లకు చెందిన వివరాలను సేకరించి వారికి నిత్యం 700 కప్పుల వరకు టీని ఫ్లాస్కుల్లో తీసుకెళ్లి విక్రయించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతను సింగిల్ టీ అయితే రూ.6కు ఫుల్ టీ అయితే రూ.10కి అమ్మడం మొదలు పెట్టాడు. అలా తన చిన్నపాటి బిజినెస్‌లో అతను సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం అతను నిత్యం స్థిరంగా 700 కప్పుల వరకు టీ అమ్ముతూ నెలకు రూ.50వేలను సంపాదిస్తున్నాడు. కష్టపడి పనిచేస్తే ఏం చేసినా విజయం సాధించవచ్చని అతను తెలిపాడు. కరోనా వల్ల ఎంతో మంది ఉపాధిని కోల్పోయినా.. ఇలా ఏదో ఒక ఆలోచన చేసి ఉపాధి పొందవచ్చని అతను పేర్కొన్నాడు.