ఓరుగల్లులో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సాక్షిగా టీఆర్ఎస్ vs బీజేపీ

-

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఘాట్‌ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఆలయ భూముల్లో ఘాట్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు. మరోవైపు పనులను అడ్డుకోవడాన్ని తప్పుపడుతున్నారు టిఆర్ఎస్ నేతలు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ఓరుగల్లో తారా స్థాయికి చేరింది….

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్మారక ఘాట్‌ను నిర్మించేందుకు టిఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తుంది. హన్మకొండ సిద్దేశ్వరాలయం సమీపంలో 3కోట్లతో ఘాట్ ను నిర్మించాలని నిర్ణయించింది టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన జయశంకర్‌ సర్ త్యాగాలకు ప్రతీకగా ఈ ఘాట్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ఆయన అంత్యక్రియలు చేసిన ప్రదేశానికి సమీపంలోనే ఘాట్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అయితే దేవాలయం సమీపంలో ఘాట్ నిర్మాణం చేపట్టడాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో జయశంకర్ సర్ ఘాట్ నిర్మాణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది…

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ బాస్కర్.. జయ శంకర్ సర్ కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. జయశంకర్‌ చివరి రోజుల్లో తన తాత తల్లి సమాధుల వద్దే తన సమాధి నిర్మించాలని తన సన్నిహితులతో చెప్పారని చీఫ్ విప్ అన్నారు. అందుకే ఆయన సమాధి స్థలంలోనే ఘాట్‌ నిర్మాణ పనులు చేపట్టాలని భావించామని చెప్పారు. కానీ చివరికి కొందరు జయశంకర్ సమాధి మీదనే ప్రహరీ నిర్మించి ఆయన్ని అవమానించారన్నారు..

ప్రొఫెసర్‌ జయశంకర్‌ కుమారుడు బ్రహ్మం కూడా తన తండ్రి చివరి రోజుల్లో చెప్పిన మాటలను గుర్తు చేశారు. తన తాత, తండ్రి, అమ్మ సమాధి పక్కనే… తన సమాధి నిర్మించాలని జయశంకర్ చెప్పేవారని అన్నారు. జయశంకర్ దహన సంస్కారాలకు వచ్చిన కేసీఆర్‌ కూడా జయశంకర్ సమాధి వద్దే ఘాట్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చాడని చెప్పారు. తెలంగాణ కోసం యావదాస్తిని దానం చేసిన తన తండ్రికి.. కనీసం ఘాటు నిర్మించడానికి స్థలం దొరకకపోవడం బాధాకరమన్నారు.

ఇక టిఆర్ఎస్ నేతల ఆరోపణలను బీజేపీ నేతలు తిప్పి కొట్టారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా జయశంకర్ సర్ ను అందరం గౌరవిస్తామని చెబుతున్నారు బీజేపీ నేతలు. కానీ జయశంకర్ సర్ పేరుతో దేవాలయ భూములు కబ్జా చేస్తే సహించమన్నారు. సిద్దేశ్వరస్వామి భూముల జోలికి వస్తే టీఆర్ఎస్ కబ్జాల బాగోతాన్ని మొత్తం బయటపెడతామని హెచ్చరించారు. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news