- రెండో విడత వ్యాక్సినేషన్లో వేయించుకోనున్నట్టు సమాచారం
- ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులకు కూడా.. !
న్యూఢిల్లీః కరోనా టీకా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి విడుతలో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ను అందిస్తున్నారు. ఇది పూర్తి కాగానే.. రెండో విడుతలో ప్రధాని మోడీ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నట్టు తాజాగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులకు కూడా వ్యాక్సిన్ అందించనున్నట్టు సమాచారం. ఇటీవలే జరిగిన ఓ సమావేశంలో రెండో విడుతలో భాగంగా 50 ఏండ్లు పైబడిన ప్రజా ప్రతినిధులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రధాని మోడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
కాగా, మొదటి విడుతలో భాగంగా మూడు కోట్ల మంది ప్రజలకు టీకాను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో టీకా అందుకుంటున్న వారిలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఉద్యోగులు ఉన్నారు. మొదటి విడుత ముగిసిన వెంటనే రెండో విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. తొలి విడుతలో భాగంగా దేశంలో ఇప్పటివరకూ మొత్తం 7.86 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా టీకాలు అందించామని బుధవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 1,12,007 మందికి టీకాలు ఇచ్చినట్టు తెలిపింది.