ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ కి గురవుతోంది. విషయం ఏమిటంటే పంచాయతీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటికి విపరీతమైన ప్రచారం కల్పించడానికి సిద్ధమైంది. దానికి అనుగుణంగా నిన్న ఒక స్పెషల్ జీవో జారీ చేసి దాని ప్రకారం ఉదయం ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఒక ప్రకటన జారీ చేసింది.
ఇవి పార్టీ రహిత ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు, ఇవి మన పంచాయతీ ఎన్నికలు అనే టైటిల్ పెట్టి మరి ఈ ప్రకటన జారీ చేశారు. పంచాయతీలని ఏకగ్రీవం చేసుకుందాం, గ్రామ అభివృద్ధికి సోపానాలు వేసుకుందాం అంటూ ఆసక్తికరంగా ఈ ప్రకటన విడుదల చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ గ్రామ పంచాయతీ కార్యాలయం అంటూ కింద నమూనా ఫోటో ఒకటి ప్రచురించారు. అది తెలంగాణకు చెందిన పంచాయతీ భవనం. ఈ విషయం గ్రామ పంచాయతీ కార్యాలయం అనే బోర్డు మీద ఉన్న లోగోలో స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెద్ద ఎత్తున ట్రోల్స్ కు గురవుతోంది.