కేఎస్ చిత్ర..ఎన్నో సూపర్‌హిట్ పాటలకు కేరాఫ్ ఆమె గొంతు. ఒకటి రెండు కాదు.. అనేక భాషల్లో పాటలు పాడారు. ఎన్నో అవార్డులు పొందారు, అంతర్జాతీయంగానూ ఖ్యాతి దక్కించుకున్నారు..! కానీ ఇప్పుడు ఆమె పాటకు మరో గుర్తింపు దక్కింది. ఆమెను కేంద్రం పద్మ భూషణ్‌తో సత్కరించింది.
క్రిష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర.. సింపుల్‌గా కేఎస్ చిత్ర..! తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు..! తెలుగు వాళ్లే కాదు.. సౌతిండియా.. అంతగా చెప్పలంటే ఇండియా మొత్తానికి తెలిసిన పేరు..! గుర్తుపట్టే గొంతు. ఎందుకంటే ఆయా భాషల్లో ఆమె 25 వేలకు పైగా పాటలు పాడారు. సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్.. ఇలా చిత్ర గొంతు.. ఎక్కడికి వెళ్లినా వినిపిస్తూ ఉంటుంది.
చిత్ర 1963, జూలై 27న కేరళలోని తిరువనంతపురములో జన్మించారు. బాల్యములో ఈమె తండ్రి కృష్ణన్ నాయర్, చిత్ర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ ఈమెను మలయాళ సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వములో తమిళ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తమిళ డబ్బింగ్ సినిమా సింధు భార్గవిలో చిత్ర తొలి తెలుగు పాట పాడారు. ఫస్ట్ స్ట్రయిట్ చిత్రం మాత్రం 1988లో వచ్చిన ఆఖరి పోరాటం.
వయసురీత్యా సుశీలమ్మ విశ్రాంతి తీసుకుంటోన్న తరుణంలో ఫిమేల్ ప్లేబ్యాక్ భారమంతా ఎస్.జానకి ఒక్కరే మోస్తున్నారు. ఆ టైమ్‌లో ఔత్సాహిక గాయనిగా కేఎస్ చిత్ర సినీపరిశ్రలోకి అడుగుపెట్టారు. మధురమైన స్వరంతో అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న చిత్ర.. బాలుతో కలిసి వేలకొద్దీ డ్యూయెట్లు ఆలపించారు. 80వ దశకం చివర నుంచి 2000వ సంవత్సరం వరకు దాదాపు 20 ఏళ్లపాటు ఏ రేడియో ప్రకటన విన్నా, ఏ ఆడియో క్యాసెట్ మీద చూసినా దాని మీద బాలు, చిత్ర పేర్లే కనిపించేవి..! చిత్రకు సౌతిండియా నైటింగల్ అన్న బిరుదు కూడా ఉంది.
బాలుతో కలిసి పాడిన పాటలు అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. గీతాంజలి సినిమాలోని జల్లంత కవ్వింత సినిమాతో చిత్రకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పెళ్లి సందడి సినిమాలోని మా పెరటి జామ చెట్టులో పాట, మాతృదేవోభవ సినిమాలోని వేణువై వచ్చాను లాంటి పాటలు అలరించాయి.
వేలకొద్ది సినిమా పాటలు, సినిమాయేతర పాటలు రికార్డు చేసింది చేసింది. తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకుంది. ఇన్ని పురస్కారాలు మరే ఇతర సింగర్ అందుకోలేదు. ఇప్పుడు ఆమెకు పద్మ భూషణ్ పురస్కారం వరించింది.