దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలో మాత్రం ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంతో పెద్దఎత్తున చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా లో పసి పిల్లలకు పోలియో చుక్కలకు బదులు హ్యాండ్ శానిటైజర్ చుక్కలు వేశారు. దీంతో సుమారు 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వారందరిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఘటన మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యాక్సిన్ వేసిన ముగ్గురిని ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తున్నట్లు సమాచారం. విచారణలో వీరిదే తప్పని తేలితే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక హైదరాబాదులో కూడా ఒక చిన్నారి పోలియో వ్యాక్సిన్ వికటించి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.