రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ చుట్టు పక్కల పలు ప్రాంతాలలో ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్‌లో ఇలా ఇంటర్నెట్‌ను షట్ డౌన్ చేయడం కొత్తేమీ కాదు. కానీ గత 4 ఏళ్లలో ఏకంగా ఇలాంటి సంఘటనలు 400 వరకు చోటు చేసుకున్నాయి. అంటే సుమారుగా 400 సార్లు దేశంలో పలు చోట్ల ఇంటర్నెట్‌ను షట్ డౌన్ చేశారు. ఓ సంస్థ ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
దేశంలో 2017 నుంచి 2021 వరకు పలు చోట్ల మొత్తం 400 సార్లు ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేశారు. 2017లో 79 సార్లు, 2018లో 134 సార్లు, 2019లో 106 సార్లు, 2020లో 83 సార్లు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 7 సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇక దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు ఇంటర్నెట్‌ను జమ్మూ కాశ్మీర్లో నిలిపివేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఏకంగా 223 రోజుల పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆగస్టు 4, 2019 నుంచి మార్చి 4, 2020 వరకు జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేశారు.
అయితే ఇలా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం వల్ల భారత్‌కు 2020లో 2.7 బిలియన్ డాలర్ల వరకు నష్టం కలిగింది. అంటే మొత్తం 8,927 గంటలు అన్నమాట. ఇదే లెక్క చూసుకుంటే గంటకు రూ.2 కోట్ల వరకు ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల భారత్‌కు నష్టం కలిగిందన్నమాట. ఇక ఈ 4 ఏళ్ల కాలంలో ఎక్కువగా రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్‌లలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.