సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్‌గేట్స్ గతంలోనే కరోనా వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి మొదలైన తొలి నాళ్లలో ఆయన గతంలో చేసిన పలు వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కరోనా వస్తుందని ఆయన ఎప్పుడో చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు ఆయన అంత ముందుగా ఎలా ఊహించి చెప్పారా ? అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు బిల్ గేట్స్ మళ్లీ అలాంటి ప్రకటనే చేశారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ కోవిడ్ కాదు.. భవిష్యత్తులో మరో రెండు అలాంటి విపత్తులు సంభవిస్తాయని అన్నారు. క్లైమైట్ చేంజ్.. అంటే మనిషి చేస్తున్న తప్పిదాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, దీంతో విపరీతమైన ప్రకృతి విపత్తులు వచ్చి భూగోళం సర్వనాశనం అవుతుందని అన్నారు.
అలాగే కరోనా లాంటి వైరస్‌లను చూసి ప్రపంచంలో ఏవైనా దేశాలు బయో వార్ ను మొదలు పెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో అదే జరిగితే కరోనా లాంటి వైరస్‌లను దేశాలు తమ శత్రుదేశాల మీదకు వదులుతాయని, దీంతో కరోనా కన్నా ఎక్కువ నష్టం సంభవిస్తుందని అన్నారు. అందువల్ల ప్రపంచం ముందు ముందు కరోనా కన్నా ప్రాణాంతకమైన విపత్తులను ఎదుర్కొనబోతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం దాదాపుగా పూర్తిగా తగ్గిపోయినా, ముందు ముందు ఇంకా ఇలాంటి విపత్తులు ఏం వస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.