పతనం అంచున పుదుచ్చేరి సర్కార్..రాహుల్ రాకతో సీన్ మారుతుందా 

-

పుదుచ్చేరి లో నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత రెండు రోజుల్లో నలుగురు ఎమ్మెల్యేల మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 30 మంది సభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో…కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు DMK సభ్యుల్ని కలుపుకుని 16 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సీఎం నారాయణ స్వామి. అయితే ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు.

30 మంది సభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేయడంతో సభలో సభ్యుల సంఖ్య 28కి తగ్గింది. ఇరు పక్షాలకు చెరో 14 మంది సభ్యులున్నారు. అయితే, తాజాగా మరో ఇద్దరి రాజీనామాతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రేపు పుదుచ్చేరికి రానున్నారు. ఎన్నికల వ్యూహంపై ఇక్కడి నేతలతో చర్చించాల్సి ఉంది. అయితే, కీలక సమయంలో నేతలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ వర్గాలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.

ఎమ్మెల్యేలు నమఃశివాయంతో పాటు తిప్పాంజన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. వీళ్లిద్దరు బీజేపీలో చేరారు. నిన్న మల్లాది కృష్ణా రావు తప్పుకోగా, ఇవాళ జాన్‌ కుమార్‌ రాజీనామా చేశారు. మల్లాది కృష్ణా రావు రాజీనామా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వారం క్రితం సీఎం నారాయణ స్వామితో కలిసి ఢిల్లీ టూర్‌కు కూడా వెళ్లారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీని ఆ పదవి నుంచి తొలగించాల్సిందిగా కోరారు. వారం తిరగకుండానే నారాయణ స్వామి ప్రభుత్వం పనితీరు బాలేదంటూ కృష్ణారావు రాజీనామా చేయడం వెనుక ఆంతర్యమేమిటనే చర్చ జరుగుతోంది.

మరోవైపు 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ఉన్నారు నమఃశివాయ. కానీ, ఎన్నికల్లో పోటీ కూడా చేయని నారాయణ స్వామికి సీఎం పదవి దక్కింది. అలాగే పుదుచ్చేరి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని కూడా తనకు కాకుండా… సుబ్రహ్మణ్యన్‌కు కట్టబెట్టడం పైనా నమఃశివాయ అసంతృప్తితో ఉన్నారు. మరి రాహుల్ తన పర్యటనలో ఈ నేతలందరిని ఒక్క తాటి పైకి తీసుకొస్తారా సంక్షోభం నుంచి కాంగ్రెస్ సర్కార్ బయటపడుతుందా అన్న చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news