మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ మీద బీజేపి చేసిన వ్యాఖ్యలు,అనంతరం పరిణామాల పై గంటా శ్రీనివాసరావు ఈ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని ఆయన అన్నారు. జనం ఆందోళనలో ఉంటే బీజేపీ కొత్త పల్లవి అందుకుందని నిర్దోషి మెడకు ఉరితాడు బిగించి ఇంకా శిక్ష అమలు కాలేదు కదా ఎందుకు రాద్దాంతం అన్నట్టుగా ఉంది బీజేపీ వైఖరి అని ఆయన అన్నారు. 100 శాతం స్టీల్ ప్లాంట్ విక్రయిస్తున్నామని కేంద్ర మంత్రులు, అధికారులు ప్రకటిస్తున్నారని బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగానే ఆర్ధిక మంత్రి స్వయంగా వెల్లడించారని అన్నారు.
పోస్కో,NMDC,RINLమధ్య వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందని ఉక్కు మంత్రిత్వశాఖ మంత్రి రాతపూర్వకంగానే చెప్పారని ఆయన అన్నారు. ప్రయివేటీకరణ విధానం తో పాటు మానవత్వం ఉండాలన్నఆయన ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగుల భద్రత, ప్లాం ట్ భవిష్యత్తు ఎవరి చేతుల్లోనూ ఉండదని అన్నారు. బీజేపీ నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని ఎందుకు ప్రకటించడం లేదని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడ్డంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాన్ కు ఎక్కువ బాధ్యత, హక్కు ఉందని గంటా పేర్కొన్నారు.