వంటింట్లో విరివిగా వాడే కరివేపాకు చేసే మేలు గురించి చాలా మందికి తెలియదు. అందుకే కూరలో కరివేపాకు అని చెప్పి పక్కన పడేస్తుంటారు. కానీ కరివేపాకు చేసే మేలు తెలిస్తే మీరు పక్కన పడేయరు. అవును, బరువు తగ్గడం నుండి జుట్టు పెరగడం, నోటి పూత సమస్యలని దూరం చేసే కరివేపాకు ప్రయోజనాలను తెలుసుకోవాల్సిందే.
జుట్టు ఊడిపోతే
కొబ్బరి నూనెని గిన్నెలో తీసుకుని ఒక గిన్నెడు కరివేపాకు ఆకుల్ని పక్కన ఉంచుకోవాలి. నూనెని ఒక పాత్రలో పోసుకుని అందులో కరివేపాకు రెబ్బల్ని వేయాలి. ఇప్పుడు దాన్ని పొయ్యి మీద వేడి చేయాలి. నూనెతో పాటు కరివేపాకు ఆకులు నలుపు రంగు వచ్చే వరకు వేడి చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒకా గాజు గ్లాసులో నిల్వ చేసుకోవాలి.
రాత్రిపూట జుట్టుకి ఆ కరివేపాకు నూనెని బాగా దట్టించాలి. తెల్లారి లేవగానే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.
బరువు తగ్గడం
10నుండి 12 కరివేపాకు రెబ్బల్ని తీసుకుని నీళ్ళలో మరిగించాలి. ఆ తర్వాత అందులో నుండి కరివేపాకులని తీసివేసి, దానిలో కొద్ది పాటి తేనె, నిమ్మరసాన్ని కలుపుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పొద్దున్న పూట కాఫీలాగా సేవించాలి.
నోటి పూత
కరివేపాకులని పొడిగా చేసి, దానిలో కొంత తేనె కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని, ఆ మిశ్రమాన్ని నోటిపూత కలిగిన ప్రదేశాల్లో పెడితే రెండు మూడు రోజుల్లో నోటిపూత నుండి విముక్తి లభిస్తుంది.
ఇవే కాదు కరివేపాకు వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.