ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు శాసన సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగించింది. ఈ ఎన్నికలు వచ్చే నెల (మార్చి) 27వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిపారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తంగా 18.68 కోట్ల ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) సునిల్ అరోడా తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో లక్షకుపైగా, కేరళలో 40 వేలు, తమిళనాడులో 89 వేలు, అసోంలో 33 వేలు, పుదుచ్చేరిలో 1500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచనున్నట్లు సీఈసీ తెలిపారు. ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించబోతున్నామన్నారు. కేంద్రపాలిత ప్రాంతంలో మినహా నాలుగు రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30.8 లక్షలు పెంచినట్లు ఆయన తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు సునిల్ అరోడా తెలిపారు. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనితోపాటు 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నట్లు తెలిపారు. దీనికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికలు జరనున్నాయి. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ పేర్కొన్నారు.