దువ్వాడకి ఎమ్మెల్సీ చాన్స్ ఇచ్చింది అందుకేనా

-

చట్టసభల్లో అడుగుపెట్టాలన్న కోరిక ఇక తీరదేమో అనుకున్న సిక్కోలు వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కి అనుకోని అదృష్టం తలుపుతట్టింది. అసలు కనీసం రేసులో కూడా లేకుండానే మండలి లిస్ట్ లో పేరు ప్రకటించడంతో ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. దువ్వాడకు ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టడం వెనుక ఉన్న కారణమేంటీ అన్న దాని పై వైసీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో పరిచయం అక్కర్లేని నాయకుడు. అధికార వైసీపీ పార్టీలో దూకుడుగా వ్యవహరించే నేతగా గుర్తింపు ఉంది. దువ్వాడ పేరు ఇప్పుడు ఎమ్మెల్సీ లిస్ట్ లో చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించారు. ఈ లిస్ట్ లో శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ..దువ్వాడ పేరును ఎమ్మెల్సీ జాబితాలో ప్రకటించడం పట్ల జిల్లాలో ముఖ్యంగా టెక్కలిలో రకరకాల చర్చ నడుస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో గత కొద్ది రోజులుగా రాజకీయమంతా టెక్కలి చుట్టూనే తిరుగుతోంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ కట్టబెట్టడంతో మరోమారు టెక్కలి పేరు తెరపైకి వచ్చింది. వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు కంట్లో నలుసులా మారిన మాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో టెక్కలి పై స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికారపార్టీ. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ను నిత్యం టార్గెట్ చేసిన అచ్చెన్నాయుడిని 2019 ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని సామాజిక సమీకరణాలతోపాటు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని వ్యూహాలు రచించి మరీ ఫ్యాన్ పార్టీ విఫలమైంది.

వైసీపీ అధికారంలోకి రావడంతో గడచిన రెండేళ్లుగా అచ్చెన్నాయుడికి ఎక్కడికక్కడ చెక్ పెడుతూనే ఉన్నారు. టెక్కలిలో కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, పేరాడ తిలక్ ఉన్నప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ దూకుడుగా వ్యవహరిస్తూ అచ్చెన్నతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అచ్చెన్న అరెస్ట్ తర్వాత టెక్కలి పై పట్టుకోసం ఈ ముగ్గురు నేతలూ చేయని ప్రయత్నం లేదు. ఇలాంటి సమయంలో ఖాళీగా ఉన్నటెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను దువ్వాడకు అధిష్టానం కట్టబెట్టింది.

నియోజకవర్గానికి ఇంఛార్జిగా దూకుడుమీదున్న దువ్వాడకు ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ కట్టబెట్టేయడంతో కొందరు ఆశ్యర్యపోతుంటే … మరికొందరు మాత్రం విధేయతకు పెద్ద పీట వేశారని గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు జిల్లా మొత్తం ఒకెత్తైతే టెక్కలి నియోజకవర్గంలో ఒకెత్తు అనేలా జరిగాయి. కింజరాపు కంచుకోటైన టెక్కలిలో తొలిసారి అత్యధిక స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అచ్చెన్నాయుడి స్వగ్రామంలో నాలుగు దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఏకచత్రాధిపత్యానికి చెక్ పెట్టడానికి దువ్వాడ తీవ్రంగానే ప్రయత్నించారు.

అచ్చెన్నాయుడిని అడ్డుకోవడం….జైలుకు పంపించడం వంటి వ్యవహారాల్లో దువ్వాడ కీలకంగా వ్యవహరించారనే చర్చ నడుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధిష్టానం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కట్టబెట్టినట్లు చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే జడ్పీ ఛైర్మన్ రేసులో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి జడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేసింది. ఇలాంటి సమయంలో దువ్వాడ పేరును ఎమ్మెల్సీగా ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు.

అసలు కనీసం రేసులో కూడా లేని వ్యక్తి పేరు ఒక్కసారిగా తెరపైకిరావడం వెనుక టార్గెట్ అచ్చెన్నాయుడు అనే ఒకే ఒక కారణం ఉండి ఉంటుందని అధికారపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు జిల్లాపార్టీ అధ్యక్షురాలిగా కిల్లి కృపారాణి వంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ దువ్వాడకే ఎమ్మెల్సీ దక్కడం పార్టీ సీనియర్లను సైతం విస్తుపోయేలా చేస్తోంది. మొత్తానికి ఎన్నికల్లో గెలవకపోయినా రెండేళ్లకే అనూహ్యంగా ఎమ్మెల్సీ దక్కించుకున్న దువ్వాడ ఎంతైనా లక్కీ ఫెలో అనుకుంటున్నారు వైసీపీ శ్రేణులు.

Read more RELATED
Recommended to you

Latest news