దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ సెకండ్ డ్రైవ్‌ను ప్రారంభించారు ప్రధాని మోడీ. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో తొలి డోస్ తీసుకున్నారు. అయితే ప్రధాని మోడీ టీకా వేసుకోవడంపై ఫైట్ మొదలైంది. ఎలక్షన్ జిమ్మిక్ అంటూ విపక్షాలు ఫైరవుతున్నాయ్. టీకా తీసుకునే సమయంలో మోడీ ధరించిన కండువా, టీకా వేసిన నర్సులు అందులో భాగమేనని ఆరోపిస్తున్నాయి. మోడీ వ్యాక్సిన్ ఎన్నికల స్టంట్‌లో భాగమన్న విపక్షాల ఆరోపణలతో వ్యాక్సిన్ వివాదం కొత్త మలుపు తిరుగుతుంది.
భారత్‌లో తయారైన కోవాగ్జిన్‌ను వేయించుకున్నారు ప్రధాని మోడీ. నర్సులు నివేద, రోసమ్మ అనిల్ మోడీకి టీకా వేశారు. ఐతే మోడీ వ్యాక్సిన్ తీసుకునే సమయంలో కండువా ధరించారు. అది అస్సామీ సంప్రదాయమైన గమోసా కావడం వివాదాస్పదంగా మారింది. త్వరలో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అస్సామీలను ఆకర్షించడానికే ఆ కండువా ధరించారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఇక మోడీకి వ్యాక్సిన్ వేసిన ఇద్దరు నర్సులు కేరళ, పుదుచ్చేరికి చెందినవారు కావడంతో దీన్ని కూడా తప్పుబడుతున్నాయి.
ప్రధాని మోడీ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా అవసరమంటూ సెటైర్ వేశారు ఎంఐఎం అధినేత అసద్. వయోవృద్ధులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలన్నారు. మోడీ వ్యాక్సిన్ వేసుకోవడం ఎలక్షన్ స్టంట్ అంటూ కొందరు చేస్తున్న విమర్శలపై నేరుగా కామెంట్ చేయకుండా.. అసద్ ఈ మాటలన్నారు. ఇక మోడీ మాస్క్ ధరించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. టీకా తీసుకునే సమయంలో కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించలేదని ఆరోపిస్తున్నాయి విపక్షాలు.