మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ కంచుకోట బద్దలవుతుందా ?

-

మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఫ్యాన్‌ ప్రభంజనంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ హోం మంత్రి ఇలాకాలో విజయం సాధించేందుకు గట్టిగా పని చేస్తోంది. అయితే టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టటం వైసీపీ తరం కాదని తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు.

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పుర పోరు ఆసక్తి రేపుతుంది. నామినేషన్‌లు విత్ డ్రా చేయించి పట్టు సాధించాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే గత ఎన్నికల్లో మాదిరే ఈసారీ తన సత్తా చూపిస్తానంటూ… టీడీపీ కూడా సై అంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురునిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు చినరాజప్ప. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే ఫలితం రిపీటవుతుందన్న ధీమాతో ఉన్నారు. అయితే పెద్దాపురం, సామర్లకోటలో ఎలాగైనా సరే అన్ని స్దానాలూ కైవసం చేసుకుని వైసీపీ జెండా ఎగరేయాలని అధికార పక్షం కూడా పట్టుదలగా ఉంది.

ఏకగ్రీవాలపై దృష్టి పెట్టిన వైసీపీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులపై గట్టి ఒత్తిడే తీసుకొచ్చింది. ఒకవేళ పోటీ నుంచి తప్పుకోకుండా ప్రచారానికి దూరంగా ఉన్నా కూడా… ప్యాకేజీ ఇస్తామని ఆశ చూపుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అప్పటికీ లొంగకపోతే.. పాత కేసులు తిరగదోడి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే చిన్నరాజప్ప అంటున్నారు.

వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థుల్ని బెదిరించాల్సిన అవసరం ఎవరికీ లేదని అంటున్నారు. మొత్తమ్మీద టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ… పట్టు నిలుపుకునేందుకు తమ్ముళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో..పెద్దాపురంలో పుర పోరు హోరాహోరీగా సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news