ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీచర్ల మొగ్గు ఎటు వైపు ?

-

తెలంగాణలో ఏ ఉద్యోగులకు లేనన్ని సంఘాలు ఉపాధ్యాయులకు ఉన్నాయి. దాదాపుగా 50 టీచర్‌ యూనియన్స్‌ ఉన్నా.. ఒకేతాటిపైకి వచ్చేవి కొన్నే. ఎవరి దుకాణం వారిదే. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు.. అధ్యాపకులు పెద్దసంఖ్యలో ఓట్లను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిణామాలవల్ల టీచర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు..యూనియన్ల ఓట్లలో చీలిక వస్తుందా అన్న చర్చ నడుస్తుంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాలు కీలక పాత్ర పోషింస్తాయనే చెప్పాలి. కొన్ని యూనియన్లు ప్రధాన పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి. అలా అనుబంధంగా ఉన్న సంఘాల ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్య ఓటును సొంత పార్టీ అభ్యర్థికే వేస్తారని అనుకుంటున్నారు. అలా అయితే న్యూట్రల్‌ సంఘాలు.. తటస్థంగా ఉండే టీచర్ల పరిస్థితి ఏంటి వారు ఎటు మొగ్గు చూపుతారు? అన్నది ప్రశ్నగా ఉంది. రెండు ఎమ్మెల్సీ సీట్లలో కలిపి దాదాపుగా లక్ష మంది టీచర్లు గ్రాడ్యుయేట్‌ ఓటర్లుగా నమోదయ్యారు.

పీఆర్సీ.. వేతన సవరణ, పెన్షన్‌ స్కీమ్‌ వంటి విషయాల్లో టీచర్లు కొంత రుసరుసలాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం ఉంది. అందుకే గ్రేటర ఎన్నికల్లో వారికి విధులు అప్పగించలేదనే టాక్‌ ఉంది. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే గ్రేటర్‌ ఫలితాలు ఉండటంతో.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది. అయితే టీచర్ల ఓట్లు ఎవరికీ గంపగుత్తగా పడే అవకాశం లేదన్నది కొందరు చెప్పే మాట. వారి మొదటి ప్రాధాన్య ఓట్లలో చీలిక వస్తుందంటున్నారు.

ఇప్పటికే కొన్ని సంఘాలు తమ మద్దతు ఎవరికో ప్రకటించాయి. వామపక్ష భావజాలం ఉన్న ఉపాధ్యాయ సంఘాలు లెఫ్ట్‌ పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేస్తామని చెప్పాయి. యూటీఎఫ్ ఈ విషయంలో క్లారిటీతో ఉన్నా.. టీపీటీఎఫ్ మాత్రం ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు సపోర్ట్‌ చేస్తోంది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బీజేపీ అండగా నిలుస్తోంది. అధికార పార్టీకి కాపు కాస్తుందని భావించిన పీఆర్టీయూ తటస్థంగా ఉండబోతుందన్న ప్రచారమే చర్చగా మారింది. పీఆర్టీయూ నాయకులు చెప్పినా టీచర్లు ఎంత మంది వింటారో అంచనా వేయలేని పరిస్థితి ఉందట.

ఓటు వేసే టీచర్లలో ఎక్కువ మంది తమకు నచ్చిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి..మిగతా ప్రాధాన్య ఓట్ల జోలికి పోయే అవకాశాలు తక్కువ. అందుకే ఈ చీలిక వల్ల లాభపడే అభ్యర్థులు ఎవరనే చర్చ జరుగుతోంది. ఒక్క టీచర్లే కాకుండా వారి కుటుంబ సభ్యులు.. టీచర్లు చెబితే వినేవాళ్లు ఎవరికి ఓటు వేస్తారన్నది కూడా ఇక్కడ కీలకమే. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీచర్ల మొగ్గు ఎటు వైపు అన్న దానిపై ప్రధాన పార్టీ అభ్యర్ధుల్లో టెన్షన్ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news