ఆరు దశాబ్దాల తర్వాత ఆ గ్రామానికి విద్యుత్ కనెక్షన్..!

-

1962లో చైనా దేశానికి భారత్‌కు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత కట్టుబట్టలతో టిబెట్‌కు చెందిన 30 కుటుంబాలు భారత్‌లో శరణార్థులుగా మారారు. ఓ ప్రాంతంలో గ్రామాన్ని కూడా ఏర్పరచుకున్నారు. ఆరు దశాబ్దాలు గడిచినా ఆ గ్రామానికి విద్యుత్ సరఫరా లేదు. కొవ్వొత్తి వెలుతురులో కాలం వెళ్లదీసేవారు. కానీ, ఆ గ్రామానికి నలుగురు ఇంజినీర్ల శ్రమ తోడైంది. దీంతో ఆ గ్రామంలో విద్యుత్ కాంతులు వెలిశాయి.

దుంగ్తి గ్రామం
దుంగ్తి గ్రామం

లద్దాఖ్‌లోని దుంగ్తి అనే గ్రామం అది. చైనా-భారత్ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని వేరు చేసే వాస్తవాధీన రేఖకి దగ్గర్లో ఉంది. ఈ గ్రామం తొలి టిబెటియన్ శరణార్థులుగా గుర్తింపు కూడా పొందింది. భారత్-చైనా యుద్ధం ముగిసిన తర్వాత ఓ గ్రామాన్ని ఏర్పరచుకున్న ఈ శరణార్థులకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. గ్రామస్థులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారు ఆరు దశాబ్దాలుగా చీకట్లోనే కాలం వెళ్లదీశారు.

గ్లోబల్ హిమాలయన్ ఎక్స్‌పెడిషన్ సంస్థ మారుమూల ప్రాంతాలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు వందకు పైగా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించింది. అయితే, ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులు దుంగ్తి గ్రామం నుంచే వేరే ప్రాంతాలకు వెళ్లారు. కానీ, దుంగ్తి గ్రామం విద్యుత్ కనెక్షన్స్ లేవని గుర్తించలేదు. ఇటీవల షఖీర్ హుస్సేన్, మరో ముగ్గురు ఇంజినీర్లు ఈ గ్రామంపై సర్వే నిర్వహించడానికి వచ్చారు. దేశంలోనే తొలి టిబెటియన్ శరణార్థుల గ్రామంగా గుర్తింపు పొందినా.. దుంగ్తి గ్రామంలో విద్యుత్ సదుపాయం లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు.

ఇంజినీర్లు.. దుంగ్తి గ్రామంలో సర్వే నిర్వహించి వెంటనే పనులు ప్రారంభించారు. సోలార్ శక్తితో 8.6 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన విద్యుత్ వ్యవస్థను ఏర్పరచారు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఈ సోలార్ విద్యుత్ కనెక్షన్‌తో మూడు ఎల్‌ఈడీ బల్బులు, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం ఉంటుంది. దీంతోపాటు పది సోలార్ ప్యానెల్స్‌తో గ్రామంలో వీధిదీపాలు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news