నిత్యం ప్రతి ఇంట్లో, రెస్టారెంట్‌లో, హోటల్‌లో, శుభ కార్యాల్లో.. ఇతర కార్యక్రమాల్లో పెట్టే విందు భోజనాల్లో ఎంతో కొంత ఆహారం వృథా అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 ప్రకారం.. ఏటా ఒక భారతీయుడు సగటున 50 కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నాడని వెల్లడైంది.
ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ తాజా నివేదిక ఇటీవలే విడుదలైంది. దాని ప్రకారం.. 2019లో ప్రపంచ వ్యాప్తంగా 931 మిలియన్ల మెట్రిక్ టన్నుల ఆహారం వృథా అయింది. ఇళ్లు, ఇనిస్టిట్యూట్స్, రిటెయిల్ ఔట్‌లెట్స్, రెస్టారెంట్లు.. ఇలా అన్ని చోట్లా కలిపి అంత మొత్తంలో ఆహారం వృథా అయింది. ప్రతి ఏడాది సగటున ఒక కుటుంబం సుమారుగా 61 శాతం వరకు ఆహారాన్ని వృథా చేస్తుందని సదరు నివేదికలో వెల్లడించారు.
ఇక ఆహారాన్ని వృథా చేసే విషయంలో ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ కాస్త మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మన దగ్గర వృథా అయ్యే ఆహారం 50కిలోలే. కానీ బంగ్లాదేశ్‌లో ఒక వ్యక్తి ఏడాదికి సగటున 65 కిలోల వరకు ఆహారాన్ని వృథా చేస్తుండగా, పాకిస్థాన్ పౌరుడు 74 కిలోలు, శ్రీలంకలో 76 కిలోలు, నేపాల్‌లో 79 కిలోలు, ఆఫ్గనిస్థాన్‌లో 82 కిలోల ఆహారాన్ని ఒక వ్యక్తి ఏటా వృథా చేస్తున్నాడని వెల్లడైంది. ఈ క్రమంలోనే ఆహారం వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలపై ఉందని, ఆహారాన్ని వృథా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సంబంధింత ఐక్యరాజ్యసమితి సంస్థ సూచించింది.