ప్రతీ ఏడాది అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచంలో పేరు తెచ్చుకున్న మహిళల గురించి తెలుసుకుని, వారి జీవితంలో సాధించిన వాటిని గుర్తుచేసుకుంటారు. మహిళల దినోత్సవాన్ని కేవలం స్త్రీవాదులే జరుపుకుంటారనే అపోహ ఉంది. నిజానికి మహిళల దినోత్సవానికి నాంది పలికింది కార్మిక ఉద్యమం. దాదపు వంద సంవత్సరాల నుండి జరుపుకుంటున్న ఈ దినోత్సవం వెనక పెద్ద చరిత్రే ఉంది. జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ ఈ మహిళల దినోత్సవానికి స్థాపకురాలు అని చెప్పుకోవచ్చు.
1857లో జన్మించిన జెట్కిన్ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. సోషల్ డెమోక్రాటిక్ పార్టీతో సంబంధం కలిగి ఉండి మహిళల ఉద్యమం, కార్మిక ఉద్యమాన్ని నడిపించింది. 1880లో అప్పటి జర్మనీ అధినేత ఒట్టోవాన్ బీస్మార్క్ సోషలిస్టు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాడు. దాంతో ఆమె నిషేధించిన సాహిత్యాన్ని ముద్రించింది. చాలా మంది సోషలిస్టులని కలుసుకుంది. అంతర్జాతీయ సోషలిస్టు ఏర్పడడానికి ఆమె చేసిన కృషి కూడా ఓ కారణం.
ఆ తర్వాత జర్మనీకి తిరిగి వచ్చి 1892 నుండి 1917వరకు డైగ్లీచిన్ అనే వార పత్రిక సంపాదకురాలిగా పనిచేసింది. అప్పుడే అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని ప్రతీ ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించారు. దాంతో 1911నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ దేశంలో జరుపుకుంటున్నారు.
ఆ తర్వాత 1913 లో ఫిబ్రవరి 28నుండి మార్చి 8వ తేదీకి మార్చారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళల దినోత్సవం నినాదం ఏమిటంటే, ఛాలెంజిలని ఎంచుకోండి. సమాజంలో ఎదురయ్యే అనేక ప్రతికూల పరిస్థితులకు బెదిరిపోకుండా వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని సమకూర్చుకుని ఛాలెంజిలకి సిద్ధంగా ఉండాలనే నినాదాన్ని ఇచ్చారు.