సమాజంలో ఎన్నో వర్గాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. ఎవరికైనా సరే సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కరించుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే వారు సమస్యలను పరిష్కరించలేకపోయినా, ఉన్న ప్రజల సమస్యలు మరింత ఎక్కువైనా.. నానాటికీ వారి జీవనం మరింత దుర్భరంగా మారినా.. వారిలో ఒక తిరుగుబాటు మొదలవుతుంది. అదే సమయంలో వారు తమ తరఫున తమ గళాన్ని వినిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తారు. నాయకుడు అనేవాడు ఎక్కడో పుట్టడు. ప్రజలే తయారు చేస్తారు. అలా ప్రజల్లోంచి వచ్చిన నాయకుడే తీన్మార్ మల్లన్న..!!
సమాజంలో ఎప్పటికప్పుడు నెలకొనే వాస్తవ పరిస్థితులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులను సమస్యలపై ప్రశ్నిస్తూ.. తీన్మార్ మల్లన్నగా ఆయన ఎంతగానో గుర్తింపు పొందారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకం అవుతూ వారి కష్ట నష్టాలను తెలుసుకున్నాడు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి పోరాటం మొదలు పెట్టాడు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు ఎంతో మంది బాగుపడుతున్నారు కానీ.. ప్రజలు ఇంకా అలాగే ఉండాలా ? వారి బతుకులు బాగు పడొద్దా ? ఇంకా ఎన్నాళ్లు నేతలు ప్రజలను మోసం చేస్తారు ? ప్రజలు ప్రశ్నించే గొంతుకలుగా మారాలి.. అనే నినాదంతో జనాల్లోకి వెళ్లాడు.
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వారి కష్టాలను విని ఆవేదన చెందాడు. కనుకనే మల్లన్న వారి గొంతుక అయ్యాడు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన నేతలు ప్రజలను పట్టించుకోకపోతే ప్రజలు ప్రశ్నించాలి, తిరగబడాలి.. అన్న సూత్రంతో ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే మల్లన్నకు అపూర్వ జనాదరణ లభిస్తోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు ఎంత మంది ఓట్లు వేశారో చూస్తేనే ఆయనకు ఎంతటి ఆదరణ ఉందో ఇట్టే అవగతం అవుతుంది. తీన్మార్ మల్లన్నగా ఆయన ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు. ఇకపై చట్టసభలోనూ ఆయన అడుగు పెట్టాలని ఆశిద్దాం..!!