ప్రస్తుతం తెలంగాణలో ప్రయివేటు ఆస్ప్రతుల దోపిడీ తీవ్ర స్థాయిలో ఉంది. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ప్రయివేటు ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వచ్చినా.. ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఇదే విషయంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది.
మంగళవారం నాడు ప్రైవేటు ఆస్పత్రుల అధిక ఛార్జీల వసూళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. అయితే ప్రైవేటు ఆస్పత్రులపై ప్రజల నుంచి 174 కంప్లైట్లు వస్తే.. 21 ఆసుపత్రులకు కరోనా చికిత్సల అనుమతులు రద్దు చేశామని డీహెచ్ హైకోర్టుకు వెల్లడించారు.
దీనిపై హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆసుపత్రుల కొవిడ్ చికిత్సల లైసెన్స్ రద్దు చేస్తే సరిపోతుందా? ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఛార్జీలు బాధితులకు తిరిగి చెల్లించాయా? అంటూ మండిపడింది ధర్మాసనం. లైసెన్స్‌ల రద్దు కన్నా ముఖ్యం బాధితులకు ఛార్జీలు తిరిగి ఇప్పించడం అని గుర్తు చేసింది. ప్రైవేటుఆ ఆస్పత్రులు వసూలు చేసిన అధిక ఛార్జీలు తిరిగి ఇవ్వకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించాలని హైకోర్టు సూచించింది.