సహజంగానే రైతులందరూ దాదాపుగా ఎప్పుడూ వేసే పంటలనే వేస్తుంటారు. కొత్త పంటలను పండించేందుకు వారు అంతగా ఇష్ట పడరు. కారణం.. ఏదైనా తేడా వస్తే భారీ నష్టాలను భరించాల్సి ఉంటుంది. అందుకనే రైతులు ఎవరూ కొత్త రకాల పంటలను వేసేందుకు ఇష్ట పడరు. కానీ కొందరు మాత్రం అనేక సవాళ్లను ఎదుర్కొని మరీ నూతన రకాల పంటలను పండిస్తున్నారు. భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి రైతుల్లో గుజరాత్‌కు చెందిన శ్రీకాంత్ భాయ్ పాంచల్ ఒకరు. గుజరాత్‌లోని బనస్కంత జిల్లా దీసా తాలూకా భోయన్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ భాయ్ పాంచల్ తనకున్న 2 ఎకరాల భూమిలో జెరేనియం మొక్క (Geranium Flowers) లను నాటాడు.
ఆ మొక్కలకు పువ్వులు పూస్తాయి. ఆ పంట 2 నుంచి 3 నెలలకు చేతికి వస్తుంది. ఇక తన పొలం దగ్గరే అతను ప్లాంట్‌ను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఆ మొక్కల పువ్వుల నుంచి ఆ ప్లాంట్‌లో నూనెను ఉత్పత్తి చేస్తున్నాడు. ఆ నూనెను లీటర్‌కు రూ.14వేల చొప్పున విక్రయిస్తూ లాభాలను గడిస్తున్నాడు.
జెరేనియం పువ్వుల నుంచి వచ్చే ఆయిల్ చక్కని సువాసనను కలిగి ఉంటుంది. అందుకని దీన్ని అరోమాథెరపీ, కాస్మొటిక్స్, పర్ఫ్యూమ్స్, సోప్‌ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ క్రమంలో ఈ ఆయిల్‌కు మన దేశంలో చక్కని డిమాండ్ ఉంది. అందుకనే ఈ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తూ అతను లాభాలను గడిస్తున్నాడు.