ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న లోక్ సభ, అసెంబ్లీ రెండింటికి ఒకేసారి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కేవలం 14 రోజులు మాత్రమే ప్రచారం చేసేందుకు సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ తరపున సీఎం జగన్ ఇప్పటికే రెండు దఫాలు సిద్ధం సభలు నిర్వహించారు. మూడోసారి కూడా కొన్ని ఏరియాల్లో రేపటి నుంచి సిద్ధం సభలు నిర్వహించనున్నారు.
తాజాగా సీఎం జగన్ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రతకు పెద్దపీట వేశారు. వీటితో పాటు మేనిఫెస్టోలో కీలక అంశాలను కూడా చేర్చారు. మత్స్యకార భరోసా కింద రూ.50వేలు అందజేస్తామని తెలిపారు. వాహన మిత్ర ఐదేళ్లలో రూ.50వేల నుంచి రూ.1లక్ష వరకు పెంపు.. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లకు రూ.10లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. 2025 నుంచి ఒకటో తరగతి చదివే వారికి ఐబీ సిలబస్, 500 మంది దళితులుంటే ప్రత్యేక గ్రామపంచాయతీగా గుర్తింపు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.