హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిని కించపరిచారని జబర్దస్త్ నటుడు హైపర్ ఆది, మల్లెమాల సంస్థపై ఎల్బీనగర్ పోలీసులకు ఓయూ జాగృతి విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైపర్ ఆది స్పందించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తెలంగాణ సంస్కృతిని తాను కించపర్చేలా మాట్లాడలేదని ఆయన చెప్పారు. ఆ షోలో తాను ఆర్టిస్టుని మాత్రమేనన్నారు. ఎడిటింగ్‌లో తప్పిదం వల్లే పొరపాటు జరిగి ఉండొచ్చని హైపర్ ఆది వివరణ ఇచ్చారు.
కాగా ఓ ఛానల్‌లో ప్రసారమైన షోలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ యాసను కించపరిచారని ఓయూ జాగృతి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆది షూటింగ్‌లో ఉన్నా అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ఆదిని తిరగనివ్వమని విద్యార్థులు మండిపడ్డారు.
అయితే ఆదిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. లీగల్ ఒపీనియన్ తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది స్పందించారు. మరి ఆది క్షమాపణలు చెబితే ఈ వివాదం ముగుస్తుందేమో చూడాలి.