మంత్రి కేటీఆర్, బల్దియా అధికారులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

హైదరాబాద్: బల్దియా అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం వర్చువల్‌లో జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగోజీగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మంత్రి, కేటీఆర్, బల్దియా అధికారులపై మండిపడ్డారు.

పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా జరుగుతున్నా కౌన్సిల్ మీటింగ్ వర్చువల్‌గా చేయడం వెనక ఉన్న దురుద్ధేశాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. మీడియాని జీహెచ్ఎంసీ‌లోకి ఎందుకు అనుమతించట్లేదని ప్రశ్నించారు. మేయర్‌ని కలిసి మీడియా ని లోపలికి అనుమతించాలని కోరినా ఫలితంలేదన్నారు. తూతూ మంత్రంగా టుత్ పాలిష్‌లాగా హైదరాబాద్‌ని చెత్త నగరంగా చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 16 పట్టణాల్లో నివాసాయిగ్యమైన ప్రాంతాల్లో హైదరాబాద్ లేదని తెలిపారు. చెత్త నగరంగా హైదరాబాద్ ని తయారు చేశారని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో సిటీస్‌లో హైదరాబాద్‌కి స్థానం లేదని చెప్పారు. మూసిలో మంత్రి కేటీఆర్ 4 గంటలు నిలబడితే అసలు సమస్యలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. త్వరలో ఆ రోజు వస్తుందని జోస్యం చెప్పారు.

 

హైదరాబాద్ నగరం తెలంగాణకు గుండెకాయలాంటిదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితముంటదని చెప్పారు. అన్ని రకాల ట్యాక్స్ లు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 800 కోట్లతో వరద నివారణ చర్యలు చేస్తామని.. పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. నాలాలు, చెరువులు కబ్జా చేసుకున్నాక చర్యలు అంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఒక మాఫియాగా ఏర్పడ్డారన్నారు.

సీసీ కెమెరాలను నాలాలు, చెరువులు, కబ్జాల ప్రాంతాల్లో పెట్టమని చెప్పామని తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియాకు అనుకూలంగా ఉండేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం లేదని పేర్కొన్నారు. త్వరలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. తూతూ మంత్రంగా మూసీ అభివృద్ది చర్యలున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news