బాగ్దాద్: ఇరాక్ మరోసారి రక్తసిక్తమైంది. బక్రీద్ (ఈద్ అల్ అద్వ) పండుగ ఏర్పాట్లలో ఉండగా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దేశ రాజధాని బగ్దాద్‌లోని రద్దీ మార్కెట్‌లో ఉదయం మావన బాంబు తనకు తాను పేల్చివేసుకోవడంతో 27 మంది మృతిచెందగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని ఆరోగ్య, భద్రతా సిబ్బంది తెలిపారు. బాంబు పేలుళ్లకు ఐసీస్ బాధ్యత వహించింది.
తూర్పు బాగ్దాద్‌లోని షియా ముస్లింల ప్రాబల్యం గల సదర్ సిటిలోని వహలియత్ బహిరంగ మార్కెట్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పేలుళ్ల ధాటికి పెద్ద ఎత్తున దుకణాలు ధ్వంసమయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. బుధవారం బక్రీద్ పండుగ పురస్కరించుకొని దుకణాలు, మార్కెట్లు కిటకిటలాడుతున్న సమయంలో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు.
బాంబు పేలుళ్లు జరిగిన గంటల వ్యవధిలోనే ఐసీస్ ప్రకటన విడుదల చేసింది. పేలుడు పదార్థాలను ధరించిన మానవ బాంబు తనకు తాను పేల్చివేసుకున్నట్లు పేర్కొంది. కానీ, ఎలాంటి ఆధారాలు చూపకపోవడం గమనార్హం.
ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (ఐఈడీ) ద్వారా పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చిన ఇరాక్ మిలిటరీ తెలిపింది. కానీ, పేలుళ్ల స్పష్టమైన కారణాలను ఇప్పుడే వెళ్లడించలేమని, దర్యాప్తు కొనసాగుతున్నదని స్పష్టం చేసింది.
ఉగ్రవాదు దాడిని ఇరాక్ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి తీవ్రంగా ఖండించారు. న్యాయస్థానంలో ఎదుట నేరస్తులను నిలబెడుతామని ప్రతిజ్ఞ చేశారు.