అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఆగస్టుకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలుపై మంత్రులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. నవరత్నాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందనను మంత్రులు ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా నాడు-నేడు జగనన్న విద్యాకానుకపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధిపైనా ఈ భేటీలో చర్చకు వచ్చింది. ఈ నెల 10న విడుదల చేయనున్న వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులకు సంబంధించి ఆర్థిక పరిస్థితిపైనా మంత్రులతో జగన్ చర్చిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్యాకెజీ చెల్లింపునకు ఈ భేటీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయాలని నిర్ణయించారు. మొత్తం రూ. 550 కోట్లు విడుదల చేసేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. మరోవైపు అగ్రిగోల్డ్ బాధితుల అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. వారికి కూడా పరిహారం చెల్లించాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. క్లీన్ ఏపీ, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కూడా మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతోంది. మరిన్ని అంశాలపైనా మంత్రులు చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.