కడప రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తెదేపాను వీడి వైసీపీ గూటికి చేరారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి చేరుకున్న మల్లికార్జున రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై, ఇతర పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈనెలాఖరున అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేడా పార్టీ మారడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన కడప జిల్లా నుంచి తెదేపా తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. దీంతో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చింది.
తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ విప్ పదవి, ఆయన తండ్రికి తితిదే పాలకమండలి సభ్యత్యం ఇచ్చింది. ఈ మధ్య కాలంలో జిల్లా నేతలతో సమన్వయం లోపించడంతో పరస్పర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా వైసీపీకి మాత్రం ఇది శుభ పరిణామమని పలువురు పేర్కొంటున్నారు.