మన దేశంలోని బ్యాంకులు పౌరులకు అనేక సదుపాయాలను అందిస్తుంటాయి. వాటిల్లో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఒకటి. దీని వల్ల అత్యవసర సమయాల్లో బ్యాంకులో డబ్బులు లేకపోయినా వాటిని విత్‌డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అంటే.. స్వల్పకాలిక రుణం అన్నమాట. ఈ సదుపాయం ఉన్నవారికి బ్యాంకు స్వల్పకాలం పాటు రుణం అందిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో తీసుకున్న మొత్తాన్ని రుణంగా పరిగణిస్తారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐతోపాటు పలు ప్రైవేటు బ్యాంకులు కూడా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో కస్టమర్లకు తమకు వచ్చే నెల జీతానికి మూడు రెట్ల మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. అయితే బ్యాంకులు అందరు కస్టమర్లకు ఈ సదుపాయాన్ని అందించవు. ఆర్థిక ప్రొఫైల్ బాగున్నవారితోపాటు శాలరీ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తుంటాయి. అందువల్ల ఈ సదుపాయం ఉందో లేదో కస్టమర్లు తమ బ్యాంక్ బ్రాంచిలో సంప్రదించి తెలుసుకోవాలి.
శాలరీ అకౌంట్లు ఉన్నవారికి ఎక్కువగా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని బ్యాంకులు అందిస్తుంటాయి. అలాగే ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేసేవారికి, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి ఈ సదుపాయాన్ని అందిస్తుంటాయి. ఆర్థికంగా బలంగా అంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవారితోపాటు క్రెడిట్ స్కోరు బాగా ఉన్నవారు అని అర్థం. వారికే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం లభిస్తుంది. ఈ క్రమంలో ఈ సదుపాయంతో శాలరీ వచ్చే మొత్తం కన్నా 3 రెట్లు ఎక్కువ మొత్తాన్ని స్వల్పకాలిక రుణంగా పొందవచ్చు. అత్యవసర సమయాల్లో ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది.