సాధారణంగా విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా కాంస్యంతో తీర్చిదిద్దుతారు. కానీ ఆ తండ్రికొడుకులు మాత్రం ఆటోమొబైల్ పార్ట్స్‌కు చెందిన స్క్రాప్ మెటీరియల్‌తో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అందుకు గాను వారు ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో టన్నుల మెటీరియల్‌ను సేకరించారు. చివరకు ఎన్నో రోజుల పాటు శ్రమించి మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలో నివాసం ఉండే కె.వెంకటేశ్వర్ రావు వృత్తి రీత్యా శిల్పి. గత 5 తరాలుగా వారిది శిల్పుల కుటుంబమే. ఈ క్రమంలోనే అతని కుమారుడు కె.రవిచంద్ర కూడా ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చదివి శిల్పిగా కొనసాగుతున్నాడు. కాగా వీరిద్దరూ హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, గుంటూరులలో అనేక ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి స్క్రాప్ మెటీరియల్‌ను సేకరించారు.
అలా సేకరించిన మెటీరియల్ మొత్తం 2 టన్నులు అయింది. దీంతో ఆ మెటీరియల్ ను ఉపయోగించి వారు త 2 నెలలుగా ప్రధాని మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దడం మొదలు పెట్టారు. అందుకు గాను వారితోపాటు మరో 10 మంది సహాయం అందించారు. దీంతో 600 గంటల పాటు వారు కష్టపడ్డారు. ఫలితంగా 14 అడుగుల మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా కాంస్యంతో విగ్రహాలను తయారు చేస్తే సులభమైన పనే అని, కానీ స్క్రాప్ మెటీరియల్ ను వాడడం వల్ల విగ్రహం తయారీ కష్టమైందని, అయినప్పటికీ పని పూర్తి చేయడం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. ఇక ఈ విగ్రహాన్ని సెప్టెంబర్ 16వ తేదీన బెంగళూరులోని ఓ పార్కులో అక్కడి కార్పొరేటర్ మోహన్ రాజుచే ఆవిష్కరణ చేయనున్నారు. కాగా స్క్రాప్ మెటీరియల్‌తో ఇలా అద్భుతంగా విగ్రహాన్ని తీర్చిదిద్దినందుకు గాను వారిని అందరూ ప్రశంసిస్తున్నారు.