ప్రజా సంకల్పయాత్ర ముగింపు సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్య, వైద్యంపై మొదటి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ డిపాజిట్ల కోసమే పోటీ పడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రామ రాజ్యం కావాలో.. రజాకార్ల రాజ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలని కోరారు.
కేంద్రం ఎక్కడా వడ్లు కొనుగోలు చేయమని చెప్పలేదని, టీఆర్ఎస్ పాలన రైతుల్ని భయపెట్టే విధంగా ఉందని, రైతులకు పంట రావడం లేదని, క్రాప్ లోన్లు రావడం లేదని ఆయన విమర్శించారు. పంచాయతీల్లో సర్పంచులకు నిధులు కూడా రావడం లేదని దుయ్యబట్టారు. సమాజంలో 80 శాతం మంది ఉన్న హిందువుల గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అని విమర్శిస్తున్నారని ఆయన ప్రజలకు వివరించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనంతరం రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.