భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. పోడు భూముల హక్కుల సాధనకై సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఈనెల 5న జాతీయ రహదార్ల దిగ్బంధం పిలుపును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు జగన్. జల్, జంగల్, జమీన్ ఆత్మగౌరవం కై విరోచితంగా పోరాడాలని… తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పేరుతో ప్రజలను ముఖ్యంగా ఆదివాసీలను అడవుల నుండి గెంటివేస్తుందన్నారు అధికార ప్రతినిధి జగన్.
ఎన్నో ఏళ్ళుగా రైతాంగం సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కలు నాటుతూ బలవంతంగా లాక్కుంటుందని.. కార్పోరేట్ సంస్థలకు ఖనిజ సంపదను అప్పగించే కుట్రలో భాగంగానే అటవి ప్రాంతంలో ఆదివాసీలకు అడవిపై, భూమిపై, నీళ్ళపై హక్కులు లేకుండా చేస్తుందని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు కల్పించాలని.. రైతాంగం పై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తి వేయాలి,అటవీ అధికారులు, పోలీసులు రైతులపై చేస్తున్న ఆటవిక చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు అధికార ప్రతినిధి జగన్.