గురివింద గింజ తన కింద నలుపుని మరిచిపోయినట్లు….. టిడిపి నేతలు తాము చేసిన తప్పులని మరిచిపోయి నిత్యం జగన్ని టార్గెట్ చేసి విమర్శించే పనిలో పడ్డారు. పోనీ నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు…కానీ గుడ్డిగా విమర్శలు చేసేస్తున్నారు. తాజాగా టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అదే పని చేశారు. జగన్..జనాలని మోసం చేశారని, హద్దులు దాటి అప్పులు చేస్తూ, ప్రజల నెత్తిపై భారం మోపుతున్నారని మాట్లాడారు. టిడిపి చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమి లేదని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చిన టిడిపిదే గెలుపు అని అన్నారు.
అయితే గతంలో టిడిపి ఏ రకంగా అభివృద్ధి చేసిందో ప్రజలు చూశారు…అలాగే యనమల ఆర్ధిక మంత్రిగా అప్పులు ఎలా తెచ్చారు….మంత్రులు, ఎమ్మెల్యేల చిరుతిండికి ఎంత బిల్లులు రాశారో కూడా తెలిసిందే. పైగా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిడిపిదే గెలుపు అంటున్నారు…అసలు రాష్ట్రం సంగతి వదిలేస్తే…యనమల సొంత నియోజకవర్గం తునిలో టిడిపి గెలిచే పరిస్తితి లేదు. ముందు అక్కడ టిడిపిని గెలిపించుకుంటే బెటర్.
అసలు తుని అంటే యనమల కంచుకోట. అక్కడ యనమల వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో ఓడిపోయాక, ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడుని తుని బరిలో నిలబెట్టారు. కానీ కృష్ణుడు ఘోరంగా ఓడిపోయారు. కాకపోతే రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావడం, యనమల ఆర్ధిక మంత్రి అవ్వడంతో…కృష్ణుడు తునిలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
అందుకే 2019 ఎన్నికల్లో మరొకసారి కృష్ణుడుని ప్రజలు ఒడగొట్టారు. రెండోసారి వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచేశారు. ఇప్పటికీ రాజా తునిలో బలంగా ఉన్నారు. ఆయన్ని ఢీకొట్టడం యనమల ఫ్యామిలీ వల్ల అయ్యేలా లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తునిలో టిడిపికి పరాభవం తప్పేలా లేదు. ఇలాంటి పరిస్తితుల్లో యనమల…సొంత నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకునే శక్తి లేకపోయినా…రాష్ట్రంలో గెలిచేస్తామని హడావిడి చేస్తున్నారు.