ఎన్నిసార్లు చావుదెబ్బలు తిన్న దాయాది దేశం పాకిస్తాన్ తీరు మారడం లేదు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తుంది. మరో వైపు స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. హిందు, సిక్కు మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలా 11 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. 2019లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు, కాశ్మీర్ విభజన తర్వాత నుంచి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్న తరుణంలో వరసగా చోటుచేసుకుంటున్న ఘటనలు లోయలో అశాంతిని రగిలిస్తోంది . ఇటీవల కాలంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 10 రోజుల్లో 9 ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటే దాదాపుగా 13 తీవ్రవాదులు హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 9 మంది జవాన్లు వీరమరణం పొందారు. వారం రోజులుగా పూంచ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతూనే ఉంది. ఉగ్రవాదుల వెనక పాక్ కమాండోల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆగస్టులో ఆప్గనిస్తాన్ ను తాలిబన్లు చేజిక్కిచ్చుకోవడం ఉగ్రవాదులకు నైతికంగా ఉత్సాహాన్ని ఇస్తోంది. రెసిస్టెంట్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ పేరిట లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు వ్యూహరచనలు చేస్తోంది. మరోవైపు జమ్ము కాశ్మీర్ లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడటం పాకిస్తాన్ కు నచ్చడం లేదు. దీంతోనే పెద్ద ఎత్తున ఉగ్రవాదులను సరిహద్దులను దాటించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత 15 రోజులుగా జరుగున్న పరిణామాలతో కేంద్రం కూడా రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఆర్మీతో పాటు, సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ అధికారులు సోదాలను నిర్వహిస్తోంది. ఎన్ఐఏ సోదాల్లో దాదాపుగా 500 మంది దాకా ఉగ్రవాద సానుభూతిపరులు పట్టుబడ్డారు. కాశ్మీర్లో అభివ్రుద్ది చర్యల కోసం పెట్టుబడులు వచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఒక వేళ ఇదే జరిగితే భవిష్యత్ కాలంలో కాశ్మీర్ ను వశపరుచుకోవడం సాధ్యపడదని పాక్ భావిస్తోంది. దీంతోనే ఆదేశ సైన్యం , ఐఎస్ఐ లు ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే భారత ఆర్మీ, ఇంటలిజెన్స్ సంస్థలు ఉగ్రవాద చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి.