అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ బై ఎలక్షన్ లో ఓటేసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. గంటగంటలకు పోలింగ్ శాతం ఎక్కువవుతోంది. ఉదయం 11 గంటలకు 33 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 45.63 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 61.66 శాతం ఉన్న పోలింగ్ పర్సెంటేజీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ 76.26 శాతానికి చేరింది. మరో రెండు గంటలు ఉండటంతో మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. గంట గంటకు పది శాతం పోలింగ్ పెరుగుతుంది. దీంతో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. గతంలో 2018 ముందస్తు ఎలక్షన్ సమయంలో 84.5 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం దీన్ని అధిగమించే అవకాశం కనిపిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. మధ్యాహ్నం నుంచి యువత పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువగా కనిపిస్తున్నారు. హుజూరాబాద్‌లో మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గతంలో ఉన్న ఓటర్ల కన్నా కొత్తగా 10 వేల వరకు కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుతుందో.. ఎవరిని నష్టపరుస్తుందో తెలియని పరిస్థితి ఉంది.
హుజూరాబాద్ పోల్ అప్డేట్: సాయంత్రం 5 గంటల వరకు 76.26 పోలింగ్ శాతం. మిగిలింది మరో రెండు గంటలే..
-