తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించి ఉందని…. దాని నుండి తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
దీని ప్రభావంతోనే ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అదే విధంగా రేపటి నుండి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో నిన్న పలుచోట్ల వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా కోరుకొండ లో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక తెలంగాణలో చలి కూడా వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.