ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం అధ్యక్షతన ఎస్ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.2134 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా ఏకంగా 7683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. వైయస్సార్ జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ మరియు రిటైల్ లిమిటెడ్ ఏర్పాటు కానుంది.
ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనుంది ఆదిత్యా బిర్లా. అంతేకాదు రూ.110 కోట్ల పెట్టుబడి పెడుతోంది. తద్వారా 2112 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వైయస్సార్ జిల్లా బద్వేలులో ప్లైవుడ్ తయారీ పరిశ్రమ, తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమకు ఎస్ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వైయస్సార్ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల (హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్) తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
అలాగే వైయస్సార్ జిల్లా కొప్పర్తి ఈఎంసీలోనే మరొక పరిశ్రమ పెట్టనుంది ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. కంపెనీల విస్తరణకు అవకాశాలున్నచోట వారికి భూములు కేటాయించాలన్నారు సీఎం వైయస్.జగన్. భవిష్యత్తులో వారు పరిశ్రమలను విస్తరించాలనుకుంటే అందుకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలని పేర్కొన్నారు.