ప్రజలను మోసగించడంలో కేసీఆర్ పిహెచ్‌డీ చేశాడు : రాములమ్మ

-

ప్రజల్ని మోసగించడంలో కేసీఆర్ పిహెచ్‌డీ పూర్తి చేసినట్టు అనిపిస్తోందని విజయశాంతి సెటైర్ వేశారు. వేదనతో కళ్లెదురుగా రోదిస్తున్నవాళ్ళను గాలికి వదిలేసి…. లోకాన్ని ఉద్ధరించడానికి వెళతానన్నట్టు కేసీఆర్ తీరు ఉందని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో జరిగిన ఉద్యమాల్లో మరణించిన రైతు కుటుంబాలకు 3 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించిన కేసీఆర్ గారికి… సొంత రాష్ట్రంలో ప్రాణాలు పోగొట్టుకున్న వేలాది మంది రైతు కుటుంబాలు గానీ, ఆయన వల్ల నడిరోడ్డున పడి ఏడుస్తున్న రైతుల గానీ మాత్రం కనిపించడం లేదని నిప్పులు చెరిగారు.

తెలంగాణ సర్కారు విధానాల వల్ల వరి, మక్క, శనగ రైతులు తమ పంటలకు మంటలు పెట్టుకున్నప్పుడు సైతం ఈయనకు రైతుల గోడు పట్టలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలోనే… ప్రతి గింజా కొంటామన్న కేసీఆర్ మాటలు నమ్మి ఎందరో రైతులు తమ ధాన్యం అమ్ముకోవడానికి కల్లాల వద్ద పడిగాపులు కాస్తూ… భారీ వర్షాల ధాటికి ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు. వీరికీ సాయం చెయ్యవచ్చు కదా?… ఒక్క రైతులే కాదు… కొండగట్టు ప్రమాదం జరిగినప్పుడుగాని, భైంసా మారణకాండ చోటు చేసుకున్నప్పుడు గాని, నిరుద్యోగులెందరో బలవన్మరణాలకు పాల్పడినప్పుడు గాని… ఇలాంటి ఎన్నో పరిణామాలు సంభవించిన పలు సందర్భాల్లో సీఎం గారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఫైర్ అయ్యారు.

ధనిక రాష్ట్రమంటూ డబ్బా కొట్టుకునే రాష్ట్రాధినేతకు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ, రుణమాఫీ అమలు, దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు అమలు లాంటి ఎన్నెన్నో విషయాల్లో తానే స్వయంగా చేస్తున్న మోసాలు కానరావడం లేదని పేర్కొన్నారు. ఈ పెద్ద మనిషి ఇప్పుడొచ్చి ఢిల్లీ దగ్గర జరిగిన రైతు ఉద్యమంలో మరణించిన వారిని చూచి తన హృదయం కరిగిపోయినట్టు బిల్డప్పులివ్వడం ఏంటన్నారు. ఎల్లకాలం అందరినీ మోసగించలేమని కేసీఆర్ గ్రహించే రోజులు దగ్గరపడుతున్నాయని ఆయన గుర్తించే సమయం వస్తోందని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news